Monday, July 21, 2014

HOW TO CHOOSE INTERMEDIET COURSES




ఇంటర్మీడియెట్ గ్రూప్... ఎంపిక ఇలా!!

పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇక ఇంటర్లో చేరడమే తరువాయి. అందుబాటులో ఎన్నో కోర్సులు... ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ... ఇలా దేనికదే ప్రత్యేకం. వీటిల్లో తనకి తగిన గ్రూపు ఎంచుకోవడం విద్యార్థికి కత్తిమీద సామే. విద్యార్థి దశలో అత్యంత నిర్ణయాత్మకమైనది ఇంటర్ అనేది నిర్వివాదాంశం. భవిష్యత్ అంతా ఇంటర్ మీదే ఆధారపడి ఉంటుందనేదీ వాస్తవం. డాక్టర్ అవుదామనే లక్ష్యం ఉండి ఎవరి ప్రోద్బలంతోనో వేరే గ్రూప్ ఎంచుకుంటే సాధించేది శూన్యం. విద్యార్థి అభిరుచికి అనువైన గ్రూపు ఎంచుకోవాలి, అప్పుడే సుస్థిర భవితకు పునాది పడుతుంది. గ్రూప్ ఎంపిక సమయంలో విద్యార్థులు అవలంబించాల్సిన వ్యూహాలు, ఆయా గ్రూపుల ప్రత్యేకతలు, నిపుణుల సలహాలు.... మీకోసం...

ఇంజనీరింగ్ కెరీర్ ‘ఎంపీసీ’:
ఓ అంశాన్ని త్వరగా అర్థం చేసుకుని అంతే తొందరగా విశ్లేషించి, వేగంగా అన్వయించే (అప్లికేషన్) నైపుణ్యం ఉన్న విద్యార్థులకు సరైన గ్రూప్ ఎంపీసీ. దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల్లో ఉన్నత విద్య, పరిశోధనల దిశగా అడుగులు వేయించే గ్రూప్ ఇది. ఈ గ్రూప్ ఎంచుకునే విద్యార్థులకు నిరంతర అధ్యయనం, కొత్త టెక్నాలజీలను అవగాహన చేసుకోవడం, వాటిలో నైపుణ్యం సాధించడం మొదలైన లక్షణాలు అవసరం. చాలామంది విద్యార్థుల్లో ఎంపీసీ అంటే ఇంజనీరింగ్‌లో చేరడానికే అనే అభిప్రాయం ఉంది. కానీ ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్‌తోపాటు అనేక అవకాశాలు ఎంపీసీ విద్యార్థుల సొంతం. ప్రస్తుతం సైన్స్ పరిశోధనల ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేసి పీహెచ్‌డీ సాధిస్తే జీవితం బంగారు బాటే. ఉద్యోగ సాధన క్రమంలో ఇంజనీరింగ్‌తో పోలిస్తే..సైన్స్ కోర్సులు టైం టేకింగ్ అనే అభిప్రాయం ఉంది. అయితే ప్రస్తుత ట్రెండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. సైన్స్‌లో ఉన్నత విద్య పూర్తి చేసిన అభ్యర్థులు ఇంజనీరింగ్ అభ్యర్థులతో సమాన గౌరవం పొందడమే కాక అంతకంటే ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. ఇన్ని విలక్షణ అవకాశాలు ఉన్న గ్రూప్ కావడంవల్లే ఎంపీసీ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ గా నిలిచింది.

బైపీసీ.. లైఫ్ సెన్సైస్‌లో బెస్ట్ ఫ్యూచర్:
బైపీసీ అంటే ఎంబీబీఎస్‌లో చేరడానికి మాత్రమే అనే అభిప్రాయం ఉంది. అయితే బైపీసీతో కేవలం ఎంబీబీఎస్ మాత్రమే కాక మరెన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బైపీసీ ఎంచుకునే విద్యార్థికి కావాల్సిన లక్షణం కష్టించే తత్వం. కారణం బైపీసీ సబ్జెక్ట్ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. అదే విధంగా ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యం ఉండే గ్రూప్ ఇది. కాబట్టి ప్రాక్టికల్ అప్రోచ్, ఎప్పటికప్పుడు చదివిన అంశాన్ని ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత అత్యంత అవసరం. ఈ గ్రూప్ ఎంచుకునే విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి, లైఫ్ సెన్సైస్ సబ్జెక్టులపై మక్కువ ఉండాలి. ప్రకృతి పరిశీలన, జంతువుల జీవన శైలి పై ఆసక్తి ఉన్న వారికి సరిపడే గ్రూప్ ఇది. బైపీసీ తర్వాత ఎంబీబీఎస్‌లో చేరి జీవితంలో స్థిరపడటం సుదీర్ఘ ప్రక్రియనే చెప్పాలి. ఎంబీబీఎస్ కన్నా త్వరగా ఉద్యోగావకాశాలు పొందే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అవి పారామెడికల్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులు. ఇవి డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చే సి పీజీ, పీహెచ్‌డీ మొదలైన ఉన్నత చదువులు చదివితే ఎంబీబీఎస్‌కు దీటుగా అవకాశాలు ఆహ్వానం పలుకుతాయనడంలో సందేహం లేదు.

ఎర్లీ ఆపర్చునిటీస్ ‘సీఈసీ:
సమస్యను విశ్లేషణాత్మక దృష్టితో చూసే లక్షణం; కొత్త విషయాల అభ్యసనంపై ఆసక్తి, నిరంతర అధ్యయన దృక్పథం, గణాంకాలను విశ్లేషించే నైపుణ్యం ఉన్న విద్యార్థులకు అనుకూలమైన గ్రూప్ సీఈసీ. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కామర్స్ నిపుణల కోసం అన్వేషణ సాగుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు సరైన కోర్సు సీఈసీ అని చెప్పొచ్చు. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు సీఈసీ ఎంతో అనుకూలమైన గ్రూప్. ఏ కోణంలో చూసినా ఎర్లీ ఆపర్చునిటీస్‌కు సీఈసీ ఓ వేదిక. ఈ గ్రూప్ ఎంచుకునే విద్యార్థులకు ఉండాల్సిన లక్షణం సహనం. చిట్టా పద్దుల్లో చిక్కుముడులను విప్పే క్రమంలో గంటలకొద్దీ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏమాత్రం సహనం కోల్పోయినా నిర్దిష్ట అంశంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వ్యాపార రంగానికి సంబంధించి ప్రభుత్వ పరంగా చట్టాల్లో జరిగే మార్పులు, వాటి పర్యవసానాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకునే నైపుణ్యం పెంపొందించుకోవాలి.

సీఈసీ పూర్తై తర్వాత చాలామంది బీకాంలో చేరతారు. ఇప్పుడు బీకాంలోనూ పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. (ఉదా: బీకాం అడ్వర్టయిజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, ఫారిన్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్). బ్యాచిలర్ డిగ్రీలో ఇలాంటి విభిన్న స్పెషలైజేషన్లను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో త్వరగా స్థిరపడొచ్చు.

కాంపిటీటివ్ అప్రోచ్‌కు హెచ్‌ఈసీ:
‘ఏ గ్రూప్‌లో సీటు రాకపోతే హెచ్‌ఈసీలో చేరతారు’.. ఈనాటి వరకూ విద్యార్థుల, వారి తల్లిదండ్రుల అభిప్రాయం ఇది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్‌ఈసీ సుస్థిర భవిష్యత్తుకు పునాది అని చెప్పొచ్చు. ముఖ్యంగా భవిష్యత్తులో పోటీ పరీక్షల ద్వారా గ్రూప్-4 మొదలు సివిల్స్ వరకు ఉండే వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు కలిసొచ్చే గ్రూప్ హెచ్‌ఈసీ.

ఈ గ్రూప్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు ఇవి. రచనా నైపుణ్యం, నిరంతర అధ్యయనం. విస్తృతంగా ఉండే అంశాల నుంచి కీలకమైన వాటిని గుర్తించే సునిశిత పరిశీలన. వీటితో పాటు సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో నిరంతరం చోటు చేసుకునే పరిణామాలను విశ్లేషించే నైపుణ్యం. ఈ నైపుణ్యాలున్న విద్యార్థులకు అతికినట్టు సరిపోయే గ్రూప్ హెచ్‌ఈసీ.

ఉన్నత విద్య కోణంలోనూ హెచ్‌ఈసీకి అనేక అవకాశాలున్నాయి. ఒకప్పుడు హెచ్‌ఈసీ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరడమే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీఏలోనూ విభిన్నమైన స్పెషలైజేషన్లు (ఉదా: హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, సోషల్ వర్క్, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్‌‌స, అడ్వర్టయిజింగ్ తదితర వృత్తి విద్యా తరహా కోర్సులు) అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌ఈసీ పూర్తయ్యాక ఆయా యూనివర్శిటీలు అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో (ఐదు సంవత్సరాలు) ప్రవేశించవచ్చు.

ఒకేషనల్ కోర్సులు :
‘ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ’.. సాధారణంగా ఇంటర్మీడియెట్ అంటే విద్యార్థులకు టక్కున గుర్తొచ్చే గ్రూపులివే. వీటితోపాటు అనేక ఇతర గ్రూపులూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇంటర్మీడియెట్ ఒకేషనల్ గ్రూపులకు ప్రాధాన్యం పెరుగుతోంది. వీటిలో ఆటోమొబైల్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెన్స్‌షిప్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, హోటల్ ఆపరేషన్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి అనేక గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. అంతేకాక ఐటీఐ విద్యార్థులకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే అప్రెంటీస్ పరీక్ష రాసే అవకాశం ఒకేషనల్ గ్రూపుల్లోని టెక్నికల్ గ్రూప్ ఉత్తీర్ణులకు లభిస్తుంది. కానీ ఈ ఒకేషనల్ కోర్సులను అందించే కళాశాలల సంఖ్య పరిమితం. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తమకు అనుకూలమైన ఒకేషనల్ గ్రూప్ ఉన్న కళాశాలల్ని అన్వేషించాలి. ఈ గ్రూపుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ప్రాక్టికల్ అప్రోచ్, క్షేత్రస్థాయిలో పనిచేసే సన్నద్ధత అవసరం.

ఎనీ గ్రూప్.. ఆపర్చునిటీస్ వెల్:
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ గ్రూప్ ఎంచుకున్నప్పటికీ ఇంటర్మీడియెట్ అర్హతగా పలు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలకు పోటీపడే అర్హత లభిస్తుంది. ఎంపీసీ విద్యార్థులకు త్రివిధ దళాల్లో కెరీర్‌ను ఖాయం చేసే ఎన్డీయే పరీక్ష రాసేందుకు అర్హత లభిస్తుంది. ఇక గ్రూప్‌తో సంబంధం లేకుండా ఇంటర్మీడియెట్ అర్హతతో బ్యాంకింగ్ రంగంలో క్లరికల్ స్థాయిలో స్థిరపడే అవకాశం అందిపుచ్చుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-4 స్థాయి ఉద్యోగాలకు పోటీ పడొచ్చు.
ఇలా ఇంటర్మీడియెట్.. కెరీర్ గమనంలో ఓ కీలక ఘట్టం. కాబట్టి గ్రూప్‌ల ఎంపికలో వ్యక్తిగత ఆసక్తులు, బలాలు, బలహీనతలు ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.