POLYTECHNIC
POLYTECHNIC

పది పూర్తయింది మొదలు.. ఎన్నో అవకాశాలు.. మరెన్నో ప్రత్యామ్నాయాలు కళ్లముందు మెదులుతాయి. నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక విద్యకు ప్రాధాన్యత పెరుగుతుండటంతో ఆ దిశగా వేసే అడుగులుఉజ్వల భవితకు దారిచూపుతాయి. ఇలాంటి కోర్సుల్లో పాలిటెక్నిక్ ఒకటి. ఇందులో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)-2014 పై ఫోకస్..

ఇంజనీరింగ్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ తదితర)లో డిప్లొమా కోర్సులు చేయాలనుకొనే విద్యార్థులు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) రాయాల్సి ఉంటుంది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్.బి.టి.ఇ.టి) -ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను చేపట్టింది. అన్ని జిల్లాల ముఖ్య కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష విధానం:
ప్రశ్నపత్రం బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్ ) పద్ధతిలో ఉంటుంది. వీటి సమాధానాలను ఓఎమ్‌ఆర్ పత్రంలో గుర్తించాలి. 120 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగె టివ్ మార్కులు ఉండవు. పరీక్ష సమయం-2 గంటలు.

పరీక్ష-స్వరూపం:
సబ్జెక్ట్                                                   ప్రశ్నలు                                        మార్కులు
మ్యాథ్స్                                                 60                                                  60
ఫిజిక్స్                                                   30                                                 30
కెమిస్ట్రీ                                                   30                                                 30
మొత్తం                                                120                                                120

అంశాలవారీ ప్రిపరేషన్ ప్లాన్
గణితం:
మొత్తం 120 ప్రశ్నలలో 60 ప్రశ్నలు గణితం నుంచే వస్తా యి. కాబట్టి విద్యార్థులు ఈ సబ్జెక్ట్‌పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ప్రిపరేషన్‌లో మిగతా అంశాలతో పోలిస్తే రెండింతల సమయం గణితానికి కేటాయిచడం మంచిది. అంతేకాకుండా 60 ప్రశ్నలకు 60 నిమిషాలలో మాత్రమే సమాధా నం రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే 120 ప్రశ్నలకు 120 నిమిషాలు మాత్రమే. అంటే తక్కువ సమయంలో వేగంతోపాటు కచ్చితత్వంతో కూడిన జవాబులను గుర్తించేలా సాధన చేయాలి. ఇందుకోసం విద్యార్థులు కొన్ని మెళకువల ను పాటిస్తే గణితంలో అత్యధిక మార్కులు సాధించవచ్చు.

ఏ చాప్టర్‌కెన్ని మార్కులు?
ప్రవేశ పరీక్షలో వచ్చే గణిత ప్రశ్నలు పదోతరగతి సిలబస్ నుంచే వస్తాయి. వీటిలో అధికభాగం త్రికోణ మితి, వైశ్లేషిక రేఖాగణితం పాఠ్యాంశాల నుంచి ఉంటాయి. ఒక్కో పాఠ్యాంశం నుంచి సుమారు 12 నుంచి 16 ప్రశ్నలు అడిగే వీలుంది. సాంఖ్యక శాస్త్రం, రేఖాగణితం నుంచి 6-8 ప్రశ్నలు, శ్రేఢులు, మాత్రికల నుంచి 3-4 ప్రశ్నలు, మిగిలిన అధ్యాయాలైన ప్రవచనాలు- సమితులు, ప్రమేయాలు, బహుపదులు, ఏకఘాత ప్రణాళిక, వాస్తవ సంఖ్యలు, గణన చాప్టర్లలో ఒక్కో అంశం నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి. త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితం, సాంఖ్యకశాస్త్రం, రేఖాగణితం, మాత్రికలు, శ్రేఢులు, అధ్యాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే బాగుంటుంది.

అవగాహన ముఖ్యం:
ప్రశ్నపత్రాన్ని పరిశీలించినట్లయితే ప్రశ్నలు పదోతరగతి సిలబస్ నుంచే ఇస్తున్నప్పటికీ కొంచెం కఠిన స్థాయిలోనే ఉంటుంది. చాలావరకు అప్లికేషన్ (అన్వయించే పద్ధతి) ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలంటే ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం పడుతుంది. (ఉదా: సాంఖ్యకశాస్త్రం). త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితం, సాంఖ్యకశాస్త్రం, రేఖాగణితం, మాత్రికలు, శ్రేఢుల పాఠ్యాంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు.

గణితంలో గట్టెక్కండిలా:

గణితానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఎక్కువ సమ యం కేటాయించాలి. పాఠ్యాంశాలను సాధన చేయాలి.
పదోతరగతి పాఠ్యాంశాలన్నింటినీ భావనలు, సూత్రాల ఆధారంగా నేర్చుకోవాలి.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలు పరిశీలించి, వాటిలో ఇచ్చే ప్రశ్నల స్థాయిని, పాఠ్యాంశాల వెయిటేజీని గుర్తించాలి. తర్వాత ఇదే తరహా ప్రశ్నలు గల సమగ్రమైన మెటీరియల్‌ను, ప్రామాణిక పుస్తకాలను సేకరించుకొని సాధన చేయాలి.
సమస్యలను సాధించేటపుడు ప్రతి ప్రశ్నను 1 నిమిషంలో సాధిస్తున్నారో లేదో అంచనా వేసుకోవాలి.
ఎక్కువగా అన్వయ(అప్లికేషన్) ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ప్రతి పాఠ్యాంశంలో ఈ తరహా ప్రశ్నలపై పట్టు సాధించండి
వివిధ నమూనా పరీక్షలను (మోడల్ టెస్ట్) 2 గంటల సమయం నిర్దేశించుకొని, ఆ సమయంలోనే పరీక్ష పూర్తి చేస్తున్నారో లేదో సరిచూసుకోండి.
నమూనా పరీక్షలను సాధన చేసేటప్పుడు సమాధానాల ను ఓఎంఆర్ పత్రంపైనే గుర్తించేటట్లు సాధన చేయాలి.
అవసరమైన చోట సమస్యలను సాధించేటపుడు సులభమార్గం (షార్ట్ కట్ మెథడ్స్) ఉపయోగించాలి.
పరీక్షరోజున ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరిలో సాధించాలి.
మోడల్ పేపర్‌‌స రాసిన తర్వాత మూల్యాంకనం చేసుకొని, తప్పుగా రాసిన ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని మళ్లీ ప్రాక్టీస్ చేయాలి.
త్రికోణమితి, వైశ్లేషిక రేఖా గణితం, సాంఖ్యక శాస్త్రం, రేఖాగణితం, మాత్రికలు, శ్రేఢులు పాఠ్యాంశాల్లో గల అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి.

Bavitha
భౌతిక, రసాయన శాస్త్రాలు:
భౌతికశాస్త్రంలో 30, రసాయన శాస్త్రం నుంచి 30 మార్కులు చొప్పున మొత్తం 60 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.

భౌతిక శాస్త్రంలో
పరీక్ష పదోతరగతి స్థాయిలోనే ఉంటుంది. కానీ 8, 9 తరగతుల పాఠ్య పుస్తకాలను కూడా చదవాలి. పదోతరగతిలోని అన్ని పాఠ్యాంశాలతోపాటు, 8వ తరగతిలోని మన విశ్వం, గతిశాస్త్రం, అయస్కాంతత్వం, విద్యుత్ పాఠాలు, 9వ తరగతి నుంచి శుద్ధగతి శాస్త్రం, గతిశాస్త్రం, కాంతి, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం పాఠాలను క్షుణ్నంగా చదవాలి.

పాఠాలలోని భావనలను విపులంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి.
సమస్యలను సాధించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి
ప్రతి భౌతిక రాశి ప్రమాణాలను, స్థిరాంకాలను గుర్తుంచుకోవాలి. అన్ని భావనలను విశ్లేషణాత్మకంగా చదివి, బిట్ల రూపంలో తయారు చేసుకోవాలి.
బిట్‌లో రెండు లేదా మూడు భావనలు ఇమిడి ఉండేలా రాసుకోవాలి.
పదో తరగతిలో ముఖ్యంగా గతిశాస్త్రం, ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఆధునిక భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్ అంశాలను క్షుణ్నంగా చదవాలి.
పదో తరగతికి చెందిన పాఠ్య పుస్తకాలు, బిట్‌బ్యాంకులపైనే ఆధార పడకుండా ఇంటర్‌లో పదో తరగతికి అనుబంధంగా ఉండే పాఠ్యాంశాలను కూడా సాధన చేస్తే బాగుంటుంది.
పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే అతి తక్కువ సమయంలోనే పాలిసెట్ ఉంటుంది. కాబట్టి లక్ష్యాత్మకంగా సాధన చేయాలి.

రసాయనంలో రాణించాలంటే:

ఈ అంశం నుంచి కూడా 30 బిట్లు ఉంటాయి. పదో తరగతిలోని 10 అధ్యాయాలూ ముఖ్యమైనవే. వీటితోపాటు 8, 9 తరగతుల పాఠ్య పుస్తకాలను కూడా చదవాలి.
8వ తరగతిలోని రసాయన చర్యలలో రకాలు, సంకేతాలు - సాంకేతికాలు, ఫార్ములాలు, రసాయన చర్యా వేగాలు ముఖ్యమైనవి.
9వ తరగతిలోని పరమాణు నిర్మాణం, రసాయన బంధం, లోహ సంగ్రహణ శాస్త్రం ముఖ్యమైనవి. వీటితోపాటు నైట్రోజన్, ఫాస్ఫరస్ అధ్యాయాల నుంచీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పదో తరగతికి అనుబంధంగా ఇంటర్‌లో ఉండే పాఠ్యాంశాలను కూడా చదివితే మెరుగైన స్కోర్‌కు వీలుంది.

పరీక్ష రాసే సమయంలో:

మొదటగా రసాయన శాస్త్రంలో అంటే 91-120 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అనంతరం భౌతికశాస్త్రంలోని వాటికి జవాబులు రాయాలి. చివరిగా గణితం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
ప్రతి ప్రశ్నను క్షుణ్నంగా చదివి సమాధానం కచ్చితంగా రూఢి చేసుకున్న తరువాతనే ఓఎంఆర్‌లో దిద్దాలి. లేకుంటే సమయం వృథా అవుతుంది.
ఒక్కోసారి ఆప్షన్స్‌ను యత్న-దోష (ట్రైల్ అండ్ ఎర్రర్ ) పద్ధతి ద్వారా కూడా ఎంపిక చేసుకోవచ్చు.
కేవలం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అయినట్లు కాకుండా కొంచెం విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ అయితే పాలిసెట్‌లో మంచి ర్యాంకు సొంతంచేసుకోవచ్చు. మీ కలను సాకారం చేసుకోవచ్చు.

పాలిసెట్-2014 ముఖ్య సమాచారం:
అర్హత: పదో తరగతి పూర్తి చేసిన వారు. లేదా ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాసు రుసుం: రూ.350 (ఫీజును ఏపీ ఆన్‌లైన్, మీసేవ, ఈసేవ కేంద్రాలలోనే చెల్లించాలి)
దరఖాస్తు స్వీకరణ తేదీ: 06-04-2014
దరఖాస్తుకు చివరి తేదీ: 28-04-2014
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేదీ: 10-05-2014
పరీక్ష తేదీ: 21-05-2014
ఫలితాల వెల్లడి : 06-06-2014
వెబ్‌సైట్: www.sbtetap.gov.in

AP DSC TRT 2018 Notification Details

View More

TSPSC Jobs and Career Info

View More

www.tsteachers.in

Telangana SSA Complete Information

View More

RPS-2015 Complete Information

View More
Top